
2 దినవృత్తాంతములు 8
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
సొలొమోను నగరాలను పునర్నిర్మించి, వ్యూహాత్మక స్థలాలను బలపరచి, కార్మికులను నిర్వహించి, సముద్ర వాణిజ్యాన్ని అభివృద్ధి చేసి, ఆలయ నియమిత ఆరాధనను కొనసాగిస్తాడు. అధ్యాయం సమన్వయ నిర్మాణం, వాణిజ్యం, రక్షణ, పవిత్ర బాధ్యతతో బలపడిన రాజ్యాన్ని చిత్రిస్తుంది.
వ్యవస్థీకరణసమృద్ధివాణిజ్యంఆరాధన
1సొలొమోను యెహోవా మందిరాన్ని, తన సొంత భవనాన్ని కట్టించడానికి తీసుకున్న ఇరవై సంవత్సరాలు ముగిసిన తర్వాత,
2హీరాము అతనికి ఇచ్చిన గ్రామాలను సొలొమోను మరలా కట్టించి వాటిలో ఇశ్రాయేలీయులను స్థిరపరిచాడు.
3తర్వాత సొలొమోను హమాత్-సోబా పట్టణం మీదికి వెళ్లి, దానిని స్వాధీనపరచుకున్నాడు.
4అతడు ఎడారిలో తద్మోరును, హమాతులో తాను కట్టించిన దుకాణ పట్టణాలన్నిటిని కూడా నిర్మించాడు.
5ఎగువ బేత్-హోరోనును, దిగువ బేత్-హోరోనును కోటగోడలతో, ద్వారాలతో, అడ్డగడియలతో కోటగోడలు గల పట్టణాలుగా కట్టించాడు.
6అలాగే బయలతు, తన ధాన్యాగారాలను, తన రథాలకు, గుర్రాలకు పట్టణాలను, యెరూషలేములో, లెబానోనులో, తాను పరిపాలించే ప్రదేశమంతటిలో తాను కట్టించాలనుకున్న వాటన్నిటిని సొలొమోను కట్టించాడు.
7హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు (ఈ ప్రజలు ఇశ్రాయేలీయులు కాదు) ఇంకా అక్కడ మిగిలి ఉన్నారు.
8ఇశ్రాయేలీయులు నాశనం చేయకుండ వదిలిన ఈ ప్రజలందరి వారసులను సొలొమోను ఈనాటికీ బానిసలుగా పని చేయడానికి నిర్బంధించాడు.
9అయితే సొలొమోను ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరిని తన పని కోసం బానిసలుగా చేయలేదు; వారు అతని సైనికులు, అతని సేనాధిపతుల అధిపతులు, రథాలకు, రథసారధులకు అధిపతులుగా ఉన్నారు.
10అంతేకాక, వారిలో రెండువందల యాభైమంది సొలొమోను రాజు ప్రజల మీద నియమించిన ముఖ్య అధికారులు కూడా ఉన్నారు.
11సొలొమోను ఫరో కుమార్తెను దావీదు పట్టణం నుండి ఆమె కోసం కట్టించిన భవనానికి తీసుకువచ్చాడు. ఎందుకంటే, ఆయన, “ఇశ్రాయేలీయుల రాజైన దావీదు భవనంలో నా భార్య నివసించకూడదు. ఎందుకంటే యెహోవా మందసం ప్రవేశించిన స్థలాలు పరిశుద్ధమైనవి” అనుకున్నాడు.
12తర్వాత సొలొమోను తాను మంటపం ముందు కట్టించిన యెహోవా బలిపీఠం మీద దహనబలులు అర్పించాడు.
13మోషే ఇచ్చిన ఆజ్ఞ ననుసరించి ప్రతిరోజు పాటించవలసిన విధి ప్రకారం సబ్బాతు దినాల్లో, అమావాస్యలప్పుడు పులియని రొట్టెల పండుగ, వారాల పండుగ, గుడారాల పండుగ అనే మూడు వార్షిక పండుగలప్పుడు యెహోవాకు దహనబలులు అర్పించేవాడు.
14తన తండ్రి దావీదు శాసనానికి అనుగుణంగా, అతడు వారి సేవలను జరిగించడానికి యాజకుల విభాగాలను, ప్రతిరోజు అవసరాన్ని బట్టి యాజకులకు సహాయం చేయడానికి, స్తుతి చేయడానికి లేవీయులను నియమించాడు. ప్రతి ద్వారానికి వంతు ప్రకారం ద్వారపాలకులుగా ఉండడానికి మనుష్యులను నియమించాడు. అతడు వివిధ ద్వారాలకు విభాగాల ప్రకారం ద్వారపాలకులను నియమించాడు. ఎందుకంటే ఇలా చేయాలని దైవజనుడైన దావీదు ఆదేశించాడు.
15వారు యాజకులకు లేవీయులకు సంబంధించిన విషయాల్లో, ఖజానాల విషయంతో సహా ఏ విషయంలోనూ రాజు ఆజ్ఞలను మీరలేదు.
16యెహోవా మందిరం పునాది వేయబడ్డప్పటి నుండి మందిరం పని మొత్తం ముగిసేవరకు సొలొమోను పనినంతా చేయించాడు. యెహోవా మందిరం పూర్తి అయింది.
17అప్పుడు సొలొమోను ఎదోము యొక్క సముద్రతీరాన ఉన్న ఏలతు దగ్గర ఉన్న ఎసోన్-గెబెరు ప్రాంతానికి వెళ్లాడు.
18హీరాము తన సేవకుల ద్వారా ఓడలను, సముద్రం గురించి తెలిసిన తన నావికులను పంపించాడు. వారు సొలొమోను మనుష్యులతో పాటు బయలుదేరి ఓఫీరుకు చేరి అక్కడినుండి సుమారు 450 తలాంతుల బంగారాన్ని తెచ్చి రాజైన సొలొమోనుకు అందజేశారు.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.