Temple artisans crafting the bronze Sea, altar, lampstands, and golden furnishings

2 దినవృత్తాంతములు 4

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
హూరాము, శిల్పులు కంచు బలిపీఠం, మహా సముద్రం, తొట్టెలు, దీపస్తంభాలు, బల్లలు, అనేక బంగారు సామగ్రిని తయారుచేస్తారు. జాగ్రత్తగా తయారుచేసిన ప్రతి వస్తువు ఆలయంలో బలి, శుద్ధి, వెలుగు, వ్యవస్థీకృత సేవకు మద్దతు ఇస్తుంది.
నైపుణ్యంఆలయంసేవఆరాధన
1హూరాము-అబి ఇత్తడి బలిపీఠం చేశాడు. దాని పొడవు ఇరవై మూరలు, వెడల్పు ఇరవై మూరలు, ఎత్తు పది మూరలు.
2అతడు పోతపోసిన ఒక గుండ్రని నీళ్ల తొట్టె చేయించాడు. అది ఈ అంచు నుండి ఆ అంచు వరకు పది మూరలు, దాని ఎత్తు అయిదు మూరలు. దాని చుట్టుకొలత ముప్పై మూరలు.
3దాని అంచు క్రింద మూరకు పది చొప్పున చుట్టూ ఎడ్ల రూపాలు ఉన్నాయి. నీళ్ల తొట్టెను పోత పోసినప్పుడు ఆ ఎడ్లు రెండు వరుసలుగా పోత పోశారు.
4ఆ నీళ్ల తొట్టె పన్నెండు ఎడ్ల మీద అమర్చబడింది, వాటిలో మూడు ఉత్తరం వైపు, మూడు పశ్చిమ వైపు, మూడు దక్షిణం వైపు, మూడు తూర్పు వైపు ఉన్నాయి. నీళ్ల తొట్టె వాటిపై ఉంచబడింది, వాటి వెనుకటి భాగాలు లోపలి వైపుకు ఉన్నాయి.
5అది బెత్తెడు మందం కలిగి ఉండి, దాని అంచు పాత్ర అంచులా, తామర పువ్వులా ఉంది. దానిలో మూడు వేల బాతుల నీళ్లు పడతాయి.
6దహనబలుల కోసం వాడే వాటిని కడగడానికి అతడు పది చిన్న గంగాళాలు చేయించి, దక్షిణ వైపున అయిదు, ఉత్తర వైపున అయిదింటిని పెట్టాడు. వాటిలో దహనబలుల కోసం వాడే వాటిని కడుగబడతాయి, అయితే పెద్ద గంగాళం యాజకులు కడుక్కోడానికి మాత్రమే ఉపయోగిస్తారు.
7అతడు వాటి వివరాల ప్రకారం పది బంగారు దీపస్తంభాలను తయారుచేసి వాటిని మందిరంలో అయిదు దక్షిణం వైపు అయిదు ఉత్తరం వైపు ఉంచాడు.
8పది బల్లలను చేయించి మందిరంలో దక్షిణ వైపున అయిదు, ఉత్తర వైపున అయిదు ఉంచాడు. బంగారంతో నూరు గిన్నెలను చేయించాడు.
9యాజకుల ఆవరణాన్ని, పెద్ద ఆవరణాన్ని చేయించాడు, ఆ ఆవరణాలకు తలుపులు చేయించి వాటిని ఇత్తడితో పొదిగించాడు.
10గంగాళాన్ని మందిరానికి దక్షిణ వైపున ముఖాన్ని ఆగ్నేయ దిక్కుకు త్రిప్పి ఉంచాడు.
11హూరాము కుండలను, చేటలను, చిలకరించడానికి వాడే గిన్నెలను కూడా చేయించాడు. కాబట్టి హూరాము యెహోవా ఆలయానికి రాజైన సొలొమోను ఆజ్ఞ ప్రకారం పనంతా చేసి ముగించాడు:
12రెండు స్తంభాలు, ఆ రెండు స్తంభాల మీద ఉన్న గిన్నెలాంటి రెండు పీటలు, గిన్నెలాంటి ఆ రెండు పీటలను కప్పడానికి రెండు అల్లికలు,
13స్తంభాలపై ఉన్న గిన్నెలాంటి పీటలను అలంకరిస్తూ ఒక్కొక్క అల్లికకు రెండేసి వరుసల చొప్పున ఆ రెండు అల్లికలకు నాలుగు వందల దానిమ్మపండ్లు,
14ఆ పీటలు వాటిపై ఉన్న తొట్లు,
15నీళ్ల తొట్టె దాని క్రింద ఉన్న పన్నెండు ఎడ్లు,
16కుండలు, చేటలు, ముండ్ల కొంకులు మొదలైన పాత్రలు. హూరాము యెహోవా ఆలయానికి సొలొమోను రాజు చేయమన్న ఈ వస్తువులన్నీ మెరుగుపెట్టిన ఇత్తడితో తయారుచేశాడు.
17రాజు వీటన్నిటిని యొర్దాను సమతల మైదానంలో, సుక్కోతుకు సారెతానుకు మధ్య ఉన్న బంకమట్టితో పోతపోయించాడు.
18సొలొమోను చేయించిన ఇత్తడి వస్తువుల సంఖ్య చాలా ఎక్కువ. ఆ ఇత్తడి బరువు ఎంతో ఎవరూ నిర్ణయించలేదు.
19దేవుని మందిరానికి సొలొమోను చేయించిన తక్కిన వస్తువులు: బంగారు బల్ల, సన్నిధి రొట్టెలు పెట్టే బల్లలు,
20గర్భాలయం ఎదుట వెలుతురు ఉండడానికి మేలిమి బంగారు దీపస్తంభాలు, వాటి దీపాలు,
21వాటి బంగారు పుష్పాలు దీపాలు కత్తెరలు పట్టుకారులు,
22మేలిమి బంగారు చేసిన వత్తులు కత్తిరించే కత్తెరలు, చిలకరించే గిన్నెలు, పాత్రలు, ధూపకలశాలు; మందిర బంగారు తలుపులు: అతి పరిశుద్ధ స్థలానికి లోపలి తలుపులు, ప్రధాన గది తలుపులు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.