
2 దినవృత్తాంతములు 10
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
రెహబాము అనుభవజ్ఞులైన పెద్దలను, యువ సహచరులను ఇద్దరినీ సంప్రదించి, తరువాత ప్రజల భారానికి కాఠిన్యంతో సమాధానమిస్తాడు. వినడానికి అతని నిరాకరణ పెద్ద తీర్పును నెరవేర్చి ఉత్తర గోత్రాలను దావీదు ఇంటి నుండి విభజిస్తుంది.
సలహాగర్వంవిభజననాయకత్వం
1రెహబామును రాజుగా చేయడానికి ఇశ్రాయేలు ప్రజలంతా షెకెముకు వెళ్లగా రెహబాము అక్కడికి వెళ్లాడు.
2రాజైన సొలొమోను దగ్గరి నుండి ఈజిప్టుకు పారిపోయి అక్కడే నివాసం చేస్తున్న నెబాతు కుమారుడైన యరొబాము ఇది విని, ఈజిప్టు నుండి తిరిగి వచ్చాడు.
3కాబట్టి ప్రజలు యరొబామును పిలిపించారు. అతడు, ఇశ్రాయేలీయులు అంతా కలిసి రెహబాము దగ్గరకు వెళ్లి అతనితో ఇలా అన్నారు:
4“మీ తండ్రి మామీద బరువైన కాడిని మోపాడు, అయితే మీ తండ్రి పెట్టిన కఠినమైన దాసత్వాన్ని, మామీద ఉంచిన బరువైన కాడిని తేలిక చేయండి, అప్పుడు మేము మీకు సేవ చేస్తాము.”
5అందుకు రెహబాము జవాబిస్తూ, “మీరు మూడు రోజులయ్యాక మళ్ళీ రండి” అన్నాడు. కాబట్టి ప్రజలు వెళ్లిపోయారు.
6అప్పుడు రెహబాము రాజు తన తండ్రి సొలొమోను బ్రతికి ఉన్నప్పుడు అతనికి సేవలందించిన పెద్దలను సంప్రదించి, “ఈ ప్రజలకు ఎలా జవాబివ్వాలో చెప్పండి” అని అడిగాడు.
7అందుకు వారు, “ఈ రోజు నీవు ఈ ప్రజల మీద దయచూపి వారిని సంతోషపరచి వారికి అనుకూలంగా జవాబు చెప్తే, వారు ఎప్పటికీ నీకు దాసులుగా ఉంటారు” అని చెప్పారు.
8కాని రెహబాము పెద్దలు ఇచ్చిన సలహాను తిరస్కరించి, తనతో పెరిగి పెద్దవారై తనకు సేవలందిస్తున్న యువకులను సంప్రదించాడు.
9అతడు వారిని, “మీ సలహా ఏంటి? ‘మీ తండ్రి పెట్టిన కాడిని తేలిక చేయండి’ అని నాతో అంటున్న ఈ ప్రజలకు నేనేమి జవాబివ్వాలి?” అని అడిగాడు.
10అతనితో పాటు పెరిగి పెద్దవారైన ఆ యువకులు జవాబిస్తూ, “ఈ ప్రజలు నీతో, ‘మీ తండ్రి మామీద బరువైన కాడి ఉంచాడు, కాని మీరు దాన్ని తేలిక చేయండి’ అని అన్నారు. కాని నీవు వారితో, ‘నా తండ్రి నడుముకంటే నా చిటికెన వేలు పెద్దది.
11నా తండ్రి మీమీద బరువైన కాడి ఉంచాడు; నేను దానిని ఇంకా బరువు చేస్తాను. నా తండ్రి కొరడాలతో కొట్టాడు; నేను తేళ్లతో కొడతాను’ అని చెప్పాలి” అన్నారు.
12రాజు, “మూడు రోజుల తర్వాత నా దగ్గరకు రండి” అని చెప్పిన ప్రకారం మూడు రోజుల తర్వాత యరొబాము ప్రజలంతా రెహబాము దగ్గరకు వచ్చారు.
13రెహబాము రాజు పెద్దలు చెప్పిన సలహాను తిరస్కరించి, వారికి కఠినంగా జవాబిచ్చాడు.
14అతడు యువకులు ఇచ్చిన సలహా ప్రకారం, “నా తండ్రి మీ కాడిని బరువుగా చేశాడు; నేను మరి ఎక్కువ బరువుగా చేస్తాను. నా తండ్రి కొరడాలతో శిక్షించాడు; నేను తేళ్లతో శిక్షిస్తాను” అని అన్నాడు.
15రాజు ప్రజల మాట వినిపించుకోలేదు, ఎందుకంటే యెహోవా షిలోనీయుడైన అహీయా ద్వారా నెబాతు కుమారుడైన యరొబాముతో చెప్పిన మాట నెరవేర్చడానికి ఈ సంఘటనలు దేవుడు ఇలా జరిగించారు.
16రాజు తమ మాట అంగీకరించలేదని తెలుసుకున్న ఇశ్రాయేలీయులంతా రాజుకు ఇలా జవాబిచ్చారు: “దావీదులో మాకేం భాగం ఉంది, యెష్షయి కుమారునిలో మాకేం స్వాస్థ్యం ఉంది? ఇశ్రాయేలీయులారా, మీ గుడారాలకు వెళ్లిపొండి! దావీదూ, నీ సొంత ఇంటి సంగతి చూసుకో!” కాబట్టి ఇశ్రాయేలీయులంతా గుడారాలకు వెళ్లిపోయారు.
17కాని యూదా పట్టణాల్లో నివసించే ఇశ్రాయేలీయుల మీద మాత్రం రెహబాము పరిపాలన చేశాడు.
18రాజైన రెహబాము వెట్టి పనివారి మీద అధికారిగా ఉన్న అదోనిరామును పంపాడు, కాని ఇశ్రాయేలీయులు అతన్ని రాళ్లతో కొట్టి చంపారు. అయితే రాజైన రెహబాము తప్పించుకుని తన రథమెక్కి యెరూషలేముకు పారిపోయాడు.
19కాబట్టి నేటికీ ఇశ్రాయేలీయులు దావీదు వంశం మీద తిరుగబడుతూనే ఉన్నారు.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.