Humble elders tending sheep as community members share burdens and keep watch near dusk

1 పేతురు పత్రిక 5

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
పెద్దలు ఇష్టపూర్వకంగా, ఆదర్శం ద్వారా కాపరిత్వం వహించాలని, యువ విశ్వాసులు వినయాన్ని ఆచరించాలని పేతురు కోరతాడు. మొత్తం సమాజం తమ ఆందోళనను దేవుడికి అప్పగించి, తిరుగుతున్న శత్రువుకు వ్యతిరేకంగా అప్రమత్తంగా ఉండి, స్థిరంగా ప్రతిఘటించి, దేవుడు వారిని పునరుద్ధరిస్తాడని బలపరుస్తాడని నమ్మాలి.
కాపరిత్వంవినయంజాగరూకతపునరుద్ధరణ
1తోటి సంఘపెద్దగా, క్రీస్తు పడిన శ్రమలకు సాక్షినై ఉండి, ప్రత్యక్షం కాబోతున్న మహిమలో భాగం పంచుకోబోతున్న నేను మీ సంఘ పెద్దలకు విజ్ఞప్తి చేసేది ఏమంటే:
2మీ స్వాధీనంలో ఉన్న దేవుని మందకు కాపరులుగా ఉండండి. అయిష్టంతో కాక దేవుని చిత్తం అనుకుని ఇష్టపూర్వకంగా దాన్ని కాపాడండి. లాభం మీద దురాశతో కాక మనస్సు పూర్వకంగా దాన్ని కాయండి;
3మీకు అప్పగించబడిన మందపై అధికారం చెలాయించక, మీరు మందకు మాదిరిగా ఉండండి.
4ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు, మీరు ఎప్పటికీ తరిగిపోని మహిమ కిరీటం పొందుతారు.
5అలానే, యవ్వనస్థులారా, మీరు మీ పెద్దలకు లోబడి ఉండండి. మీరందరు వినయం అనే వస్త్రాన్ని ధరించాలి. ఎందుకనగా, “దేవుడు గర్విష్ఠులను వ్యతిరేకిస్తారు కాని దీనులకు దయ చూపిస్తారు.”
6దేవుని బలమైన చేతి క్రింద మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అప్పుడు తగిన సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చిస్తారు.
7ఆయన మీ గురించి చింతిస్తున్నారు కాబట్టి మీ చింతలన్ని ఆయనపై మోపండి.
8మెలకువతో జాగరూకులై ఉండండి. మీ శత్రువైన సాతాను గర్జించు సింహంలా తిరుగుతూ ఎవరినైన మ్రింగివేయాలని చూస్తున్నాడు.
9దృఢ విశ్వాసులై వానిని ఎదిరించండి. ప్రపంచమంతా ఉన్న విశ్వాసుల కుటుంబం ఇలాంటి బాధలనే అనుభవిస్తుందని మీకు తెలుసు.
10తన శాశ్వత మహిమలోనికి క్రీస్తులో మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియైన దేవుడు, మీరు కొంతకాలం బాధలు పొందిన తర్వాత ఆయనే స్వయంగా మీకు స్థిరత్వాన్ని, బలాన్ని అనుగ్రహిస్తారు.
11ఆయనకే నిరంతరం ప్రభావం కలుగును గాక ఆమేన్.
12నేను నమ్మకమైన సహోదరునిగా భావించే సీల సహాయంతో ఈ కొద్ది మాటలు వ్రాస్తున్నాను, మిమ్మల్ని ప్రోత్సహించాలని, ఇది దేవుని నిజమైన కృప మాత్రమే అని సాక్ష్యమిస్తున్నాను. మీరు దీనిలో నిలిచి ఉండండి.
13బబులోనులో మీలా ఏర్పరచబడిన మీ సహోదర సంఘం, నా కుమారుడైన మార్కు కూడ మీకు శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు.
14ప్రేమపూర్వకమైన ముద్దుతో ఒకరికొకరు శుభాలు చెప్పుకోండి. క్రీస్తులో ఉన్న మీకందరికి శాంతి కలుగును గాక.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.