
1 దినవృత్తాంతములు 20
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
దావీదు కిరీటం, దోపిడీని అందుకుంటుండగా యోవాబు రబ్బాను పట్టుకుంటాడు. తరువాతి ఫిలిష్తీయ దిగ్గజాలతో సంఘర్షణలు దావీదు యోధులచే గెలువబడతాయి, భయపెట్టే శత్రువులు పంచుకున్న ధైర్యం, విశ్వసనీయత ద్వారా పడిపోతారని చూపిస్తాయి.
ధైర్యంవిజయంయోధులుపట్టుదల
1వసంతకాలంలో, రాజులు యుద్ధానికి బయలుదేరే కాలంలో, యోవాబు సైన్యాన్ని సమకూర్చుకున్నాడు. అతడు అమ్మోనీయుల దేశాన్ని నాశనం చేసి రబ్బా పట్టణాన్ని ముట్టడించాడు. అయితే దావీదు యెరూషలేములోనే ఉండిపోయాడు. యోవాబు రబ్బాపై దాడి చేసి దానిని నాశనం చేశాడు.
2దావీదు వారి రాజు తలమీద నుండి కిరీటాన్ని తీసుకున్నాడు, అది ఒక తలాంతు బరువు కలిగి ఉండి, ప్రశస్తమైన రాళ్లతో పొదిగించబడి ఉంది. దాన్ని దావీదు తలమీద పెట్టుకున్నాడు. అతడు ఆ పట్టణం నుండి పెద్ద మొత్తంలో దోపుడుసొమ్ము తీసుకెళ్లాడు.
3అక్కడి ప్రజలను బయటకు తీసుకువచ్చి రంపతో, పదునైన ఇనుప పనిముట్లతో, గొడ్డళ్ళతో కఠినమైన పని చేయించాడు. దావీదు అమ్మోనీయుల పట్టణాలన్నిటికి ఈ విధంగా చేశాడు. తర్వాత దావీదు అతని సైన్యమంతా యెరూషలేముకు తిరిగి వచ్చారు.
4కొంతకాలం తర్వాత, గెజెరు దగ్గర ఫిలిష్తీయులతో యుద్ధం జరిగింది. ఆ సమయంలో హుషాతీయుడైన సిబ్బెకై, రెఫాయీయుల వారసుడైన సిప్పయి అనే వాన్ని చంపగా ఫిలిష్తీయులు లొంగిపోయారు.
5ఫిలిష్తీయులతో జరిగిన మరో యుద్ధంలో యాయీరు కుమారుడు ఎల్హానాను, గిత్తీయుడైన గొల్యాతు సోదరుడైన లహ్మీని చంపాడు. అతని ఈటె నేతపనివాని అడ్డకర్రంత పెద్దది.
6గాతు దగ్గర జరిగిన మరో యుద్ధంలో చాలా పొడవైన వాడొకడు ఉన్నాడు. అతని రెండు చేతులకు కాళ్లకు ఆరు వ్రేళ్ళ చొప్పున మొత్తం ఇరవైనాలుగు వ్రేళ్ళు ఉన్నాయి. అతడు కూడా రాఫా సంతతివాడు.
7అతడు ఇశ్రాయేలీయులను దూషించినప్పుడు, దావీదు సోదరుడు, షిమ్యా కుమారుడైన యోనాతాను అతన్ని చంపాడు.
8వీరు గాతుకు చెందిన రాఫా సంతతివారు, వీరు దావీదు అతని సైనికుల చేతిలో చనిపోయారు.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.