
1 దినవృత్తాంతములు 15
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
దావీదు మందసము కోసం స్థలాన్ని సిద్ధం చేసి పవిత్రపరచబడిన లేవీయులు సూచించిన విధంగా దానిని మోయాలని పట్టుబడతాడు. గాయకులు, సంగీతకారులు యెరూషలేములోకి సంతోషకరమైన ఊరేగింపును నడిపిస్తారు, మీకాలు తిరస్కారంతో చూస్తుండగా.
సిద్ధతమందసముసంతోషంభక్తి గౌరవం
1దావీదు తన కోసం దావీదు పట్టణంలో భవనాలు కట్టించుకున్న తర్వాత, అతడు దేవుని మందసం కోసం ఒక స్థలాన్ని సిద్ధపరచి దాని కోసం గుడారం వేయించాడు.
2తర్వాత దావీదు, “దేవుని మందసాన్ని మోయడానికి నిత్యంగా తనకు సేవ చేయడానికి యెహోవా లేవీయులను ఎన్నుకున్నారు కాబట్టి వారు తప్ప ఇంకెవరు యెహోవా మందసాన్ని మోయకూడదు” అని చెప్పాడు.
3యెహోవా మందసాన్ని తాను సిద్ధపరచిన స్థలానికి తీసుకురావడానికి దావీదు ఇశ్రాయేలీయులందరిని యెరూషలేములో సమావేశపరిచాడు.
4అప్పుడు అహరోను వారసులను, లేవీయులను పిలిపించాడు, వారు వీరే:
5కహాతు వారసులలో నుండి, వారి నాయకుడైన ఊరియేలు, అతని బంధువుల్లో 120 మంది;
6మెరారి వారసులలో నుండి వారి నాయకుడైన అశాయాను, అతని బంధువుల్లో 220 మంది;
7గెర్షోను వారసులలో నుండి వారి నాయకుడైన యోవేలు, అతని బంధువుల్లో 130 మంది;
8ఎలీషాపాను వారసులలో నుండి వారి నాయకుడైన షెమయా, అతని బంధువుల్లో 200 మంది;
9హెబ్రోను వారసులలో నుండి వారి నాయకుడైన ఎలీయేలు, అతని బంధువుల్లో 80 మంది;
10ఉజ్జీయేలు వారసులలో నుండి వారి నాయకుడైన అమ్మీనాదాబు, అతని బంధువుల్లో 112 మంది.
11తర్వాత దావీదు యాజకులైన సాదోకు అబ్యాతారులను, లేవీయులైన ఊరియేలు, అశాయాను, యోవేలు, షెమయాను, ఎలీయేలు, అమ్మీనాదాబులను పిలిపించాడు.
12అతడు వారితో ఇలా అన్నాడు, “మీరు లేవీయుల కుటుంబ పెద్దలు; ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందసాన్ని, నేను సిద్ధపరచిన స్థలానికి తీసుకురావడానికి మీరు, మీ బంధువులు, మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి.
13లేవీయులైన మీరు ఇంతకుముందు మన దేవుడైన యెహోవా మందసాన్ని మోయలేదు కాబట్టి మన దేవుడైన యెహోవా కోపంతో మనమీద విరుచుకుపడ్డారు. మనం ఎలా చేయాలో నియమించబడిన విధానం ప్రకారం ఆయనను అడగలేదు.”
14అప్పుడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందసాన్ని తీసుకురావడానికి యాజకులు, లేవీయులు తమను తాము ప్రతిష్ఠించుకున్నారు.
15యెహోవా చెప్పిన మాట ప్రకారం మోషే ఆజ్ఞాపించినట్లు లేవీయులు దేవుని మందసాన్ని దాని మోతకర్రలతో తమ భుజాల మీదికి ఎత్తుకున్నారు.
16తమ తోటి లేవీయులను సితారలు, వీణలు, తాళాలు మొదలైన వాయిద్యాలతో సంతోషకరమైన ధ్వని చేయమని సంగీతకారులుగా నియమించమని లేవీ నాయకులకు దావీదు ఆదేశించాడు.
17కాబట్టి లేవీయులు యోవేలు కుమారుడైన హేమానును నియమించారు; అతని బంధువుల్లో బెరెక్యా కుమారుడైన ఆసాపు; వారి బంధువులైన మెరారీయులలో కూషాయాహు కుమారుడైన ఏతాను;
18వారితో పాటు రెండవ వరుసలో ఉన్న తమ బంధువులు: జెకర్యా, బేను, యహజీయేలు, షెమీరామోతు, యెహీయేలు, ఉన్నీ, ఏలీయాబు, బెనాయా, మయశేయా, మత్తిత్యా, ఎలీఫెలెహు, మిక్నేయాహులు, ద్వారపాలకులైన ఓబేద్-ఎదోము, యెహీయేలు.
19సంగీతకారులైన హేమాను, ఆసాపు, ఏతానులు ఇత్తడి తాళాలను వాయించాలి;
20జెకర్యా, అజీయేలు, షెమీరామోతు, యెహీయేలు, ఉన్నీ, ఏలీయాబు, మయశేయా, బెనాయాలు అలామోతు శైలిలో వీణలు వాయించాలి,
21మత్తిత్యా, ఎలీఫెలెహు, మిక్నేయాహు, ఓబేద్-ఎదోము, యెహీయేలు, అజజ్యాహులు షెమినిత్ సితారలు వాయించాలి.
22లేవీయుల నాయకుడైన కెనన్యా సంగీత నిర్వహణలో నైపుణ్యత గలవాడు కాబట్టి గాయకుల బృందానికి నాయకునిగా నియమించబడ్డాడు.
23బెరెక్యా, ఎల్కానా దేవుని మందసానికి కావలివారిగా నియమించబడ్డారు.
24షెబన్యా, యెహోషాపాతు, నెతనేలు, అమాశై, జెకర్యా, బెనాయా, ఎలీయెజెరు అనే యాజకులు దేవుని మందసం ముందు బూరలు ఊదడానికి నియమించబడ్డారు. ఓబేద్-ఎదోము, యెహీయా దేవుని మందసానికి కావలివారిగా కూడ నియమించబడ్డారు.
25కాబట్టి యెహోవా నిబంధన మందసాన్ని ఓబేద్-ఎదోము ఇంటి నుండి ఉత్సాహంతో తీసుకురావడానికి దావీదు, ఇశ్రాయేలీయుల పెద్దలు, సహస్రాధిపతులు వెళ్లారు.
26ఎందుకంటే యెహోవా నిబంధన మందసాన్ని మోస్తున్న లేవీయులకు దేవుడు సహాయం చేశారు, వారు ఏడు ఎడ్లను, ఏడు పొట్టేళ్ళను బలిగా అర్పించారు.
27దావీదు, మందసాన్ని మోసిన లేవీయులందరు, సంగీతకారులు, సంగీత నాయకుడు కెనన్యా సన్నని నారతో నేసిన వస్ర్తాలు ధరించారు. దావీదు సన్నని నారతో నేసిన ఏఫోదును కూడా ధరించాడు.
28ఇశ్రాయేలీయులందరు ఆనందోత్సాహాలతో పొట్టేళ్ల కొమ్ము బూరల ధ్వనితో, తాళాలు వీణలు సితారలు వాయిస్తూ, యెహోవా నిబంధన మందసాన్ని తీసుకువచ్చారు.
29యెహోవా నిబంధన మందసం దావీదు పట్టణంలోనికి వస్తుండగా, సౌలు కుమార్తె మీకాలు కిటికీలో నుండి చూసింది. రాజైన దావీదు ఆనందోత్సాహాలతో నాట్యం చేయడం చూసి తన మనస్సులో అతన్ని నీచంగా చూసింది.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.